కథలు » నేరానికి తమ్ముళ్ళు
   
 


 ఉద‌య‌పు శ‌బ్దాలు లీల‌గా వినిపిస్తుంటే మెల్ల‌గా క‌ళ్ళు తెరిచాను. ఆ మ‌స‌క చీక‌టిలోనే అసంక‌ల్పితంగా, అల‌వాటుగా చేయిచాచి స్టూలు మీదున్న సెల్‌ఫోన్ అందుకుని టైం చూశాను. ఉద‌యం ఆరు గంట‌ల‌వుతోంది. విక్రం నిద్ర‌కి భంగం క‌ల‌గ‌కుండా మెల్ల‌గా మంచం దిగి, బెడ్రూంలోంచి బ‌య‌ట‌కు న‌డిచాను. మెయిన్ డోర్ తీసి; బ‌య‌ట గోడ‌కి వేలాడుతున్న బాస్కెట్‌లోంచి పాల‌ప్యాకెట్‌, ఇవాల్టి వార్తా ప‌త్రిక తీసుకుని వంట‌గ‌దిలోకి వ‌చ్చాను. పాలు పొయ్యిమీద పెట్టి, నించునే ప‌త్రిక‌ని తిర‌గేస్తున్నాను.

ఒక రాజ‌కీయ నాయ‌కుడి త‌ప్పుల్ని ఎండ‌గ‌డుతూ, త‌న ఖాతాలోని త‌ప్పుల్ని చిన్న‌గా చూపి జ‌నాల్నిమ‌భ్య‌పెట్టాల‌నుకునే ఒకో రాజ‌కీయ నాయ‌కుడి ప్ర‌సంగం ఒక‌టీ; మైన‌ర్ బాలిక‌ల‌పై మాన‌భంగాల వార్త‌లో రెండూ; న‌గదూ బంగారాల అప‌హ‌ర‌ణ కేసులు మూడు; యాక్సిడెంట్ వార్త‌లో నాలుగూ;.. ప‌త్రిక చూడ‌గానే ఆక‌ట్టుకునేలా ముద్రించిన వార్త‌లు ఇవే..! ఇలాంటి ఎన్నో వార్త‌ల్ని చూపే టెలివిజ‌న్ మీడియాకి చెందిన మ‌నిషినే నేను కూడా. కానీ ఎంత విజ్ఞానం చేతిలో ఉన్నా, ఈ స‌మాజంలోని చాలా మందిలా నేనూ ఒక నిమిత్త‌మాత్రురాలిలా మిగిలిపోయాను. అందుకే ఇలాంటి వార్త‌ల్ని చ‌దివిన‌ప్పుడ‌ల్లా నాలో అణిచిపెట్టుకున్న ఆవేశం ఉన్న‌పాటుగా హెచ్చి, రక్తం మ‌రుగుతుంటుంది.రోజుటిలానే మ‌న‌సు అదోలా అయిపోయింది. పొయ్యి మీద పాలు మ‌రుగుతున్నాయి. నాలో ర‌క్తమూ మ‌రుగుతోంది..! అది ఆవేశ‌మై పొంగి స‌మాజంలోని అప‌స‌వ్య‌త‌ల్ని క‌ప్పెట్టెయ్యాల‌ని ఆత్రుత ప‌డుతోంది..!!

 ఈ రోజు మా చైర్మ‌న్ గారు వ‌స్తున్నారు. బ్రాంచ్‌లో ముఖ్య‌మైన మీటింగ్ ఉంది, అంద‌రూ షార్ప్‌గా టైంకి ఆఫీసులో ఉండాల‌న్న మెసేజ్ నిన్న‌నే అంద‌రికీ పాస్ చేయ‌బ‌డింది. నేను రోజుటిలా ముందే ఆఫీసుకి చేరుకున్నాను. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కి మొద‌లైంది మీటింగ్‌..! సాయంత్రం ఆరు గంట‌ల‌వుతుంటే,

`` ఇక ప్ర‌శ్న‌లేమీ లేవు క‌దా.. `` అంటూ మా అంద‌రి వంకా చూసి, లేవ‌డానికి ఉద్యుక్తుల‌వుతున్నారు ` ఆర్జే మీడియా క‌మ్యునికేష‌న్స్‌` ఛైర్మ‌న్ రాంజోషి.

 `ఇప్పుడీయ‌న వెళ్ళిపోతే, మ‌ళ్ళీ ఏ ఆరునెల‌ల‌కోగానీ మా బ్రాంచ్‌కి రారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ అవ‌కాశాన్ని చేజార్చుకోకూడ‌దు..` అనుకుంటూనే, ఎదురుగా ఉన్న లెట‌ర్‌ప్యాడ్ అందుకుని గ‌బ‌గ‌బా నాలుగు ప‌దాలు వ్రాసి, ``పాస్‌`` అని నా ప‌క్క‌నున్న సిటీడెస్క్ ఎడిట‌ర్ వేణుబాధ‌వ్‌కి ఇచ్చాను. ఆ కాగితం ఆరుగురిని దాటివెళ్ళి మా ఛైర్మ‌న్ గారి చేతుల్లోకి చేరింది. ఆయ‌న ఒక క్ష‌ణం దాన్ని చూసి, ఇది పంపింది ఎవ‌ర‌న్న‌ట్టుగా క‌ళ్ళెత్తి చూశారు. అంద‌రి త‌ల‌లూ నావైపు తిరిగాయి. ఛైర్మ‌న్ గారిని చూస్తూ, లేచి నుంచున్నాను.

 నేను న‌డుస్తూంటే, నా వెనుక ఉన్న ప‌దిమందీ నాళ్ళు వెళ్ళ‌బెట్టి చూస్తుంటార‌ని నాకు తెలుసు. కానీ, వాళ్ళ‌లో ఉన్న ఒక్క శ్వేత మాత్ర‌మే ఇప్పుడు నాలో బ‌ద్ద‌ల‌వ‌బోయే అగ్నిప‌ర్వ‌తాన్ని ఊహించ‌గ‌ల‌దేమో..!  ఛైర్మ‌న్ గారి ప‌ర్స‌న‌ల్ రూం... ఆయ‌న టేబుల్ ఎదురుగా కూర్చున్నాను నేను. ఆప్పుడే ప్రోగ్రాం అసోసియేట‌ర్ క‌న‌క‌రాజు, ఆ వెనుక న్యూస్ ప్రోగ్రాం డైరెక్ట‌రు ర‌త్నాక‌ర్ లోప‌లికొచ్చారు.

  ` ఇప్పుడు వ‌స్తున్న ప్రోగ్రాంల గురంచి మీతో మాట్లాడాలి..` అని నేను స్లిప్ మీద రాసిచ్చినందుకే వీళ్ళిద్ద‌రినీ పిలిపించార‌ని అర్థ‌మైంది. ఈ విష‌యంతో మ‌రోసారి ఛైర్మ‌న్‌గారు ఎంతో పార‌ద‌ర్శ‌కంగా ఉంటారో అర్థ‌మైంది నాకు.

  కంప్లైంట్ ఎవ‌రి మీద ఇవ్వ‌బోతున్నామో వాళ్ళ‌ముందే విష‌యాన్ని చెప్ప‌డ‌మంటే.. టీచ‌ర్ చేస్తున్న‌ది త‌ప్పు అని విద్యార్థి చెప్ప‌వ‌ల‌సిన ప‌రిస్థితిలా, అరిచేతుల్లో చెమ‌ట‌లు ప‌డుతున్నాయి.

 వాళ్ళ‌ని కూర్చోమ‌ని సైగ చేస్తూ, `` ఇప్పుడు వ‌చ్చే ప్రోగ్రాముల గురించి హార‌తీ ఏదో మాట్లాడుతుంద‌ట‌..`` అని నావంక చూపించి, నా సంశ‌యాన్ని గ్ర‌హించిన‌ట్టు, `` నువ్వు ఏం చెప్పాల‌నుకుంటున్నావో సంకోచించ‌కుండా చెప్పు హార‌తీ.. `` అన్నారు మా ఛైర్మ‌న్ రాంజోషి.

 వాళ్ళిద్ద‌రి వంకా చూసి, `` స‌ర్‌.. నేను చెప్పేది ఇక్క‌డ అభ్యంత‌ర‌క‌రంగా ఉండ‌వ‌చ్చేమో..!`` అన్నాను సూచ‌న‌ప్రాయంగా.

 `` అసలు విష‌యం ఏంటో తెలియాలిగా. ప‌ర్వాలేదు. చెప్పు..`` అన్నారాయ‌న‌.

 `` స‌ర్‌.. ఒక ఛాన‌ల్ పెట్టి; న‌లుగురికీ మంచీ చెడూ చూపిస్తూ, దిశానిర్దేశ‌నం చెయ్య‌గ‌లిగే మీడియావృత్తిలో ఉన్న మ‌నం ప్రోత్స‌హించాల్సింది మంచినేగానీ, చెడుని కాదుక‌ద స‌ర్‌..`` అని గాఢంగా అన్నాను.

  `` నువ్వు చెప్పింది ఎగ్జాట్లీ క‌రెక్ట్. బ‌ట్‌.. మ‌న ఛాన‌ల్‌లో చెడుని ఎక్క‌డ ప్రోత్స‌హించాం..? `` అని సీరియ‌స్‌గా అడిగారాయ‌న‌.

 క‌న‌క‌రాజు, ర‌త్నాక‌ర్ ఇద్ద‌రూ నా వంక సీరియ‌స్‌గా చూశారు. నేను మాత్రం ఆత్మ‌స్థైర్యంతో,  `` క్రైమ్‌ని.. ఛాల‌న్‌లో ఒక వార్త‌గా మాత్ర‌మే చూపిస్తే దాని ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌దేమో స‌ర్‌. కానీ అందులోని శాడిజాన్ని ఆక‌ర్ష‌ణీయంగా చూపిస్తూ, దానికి విభిన్న నేప‌థ్య‌సంగీతాల్ని నింపి ప్ర‌సారం చేయ‌డం స‌మాజంలో ఉన్న చెడుని ప్రోత్స‌హించ‌డ‌మే స‌ర్‌. ఇది చూసేవాళ్ళ‌ని మాన‌సికంగా చాలా ప్ర‌భావితం చేస్తుంది..`` అన్నాను.

 `` మ‌న ఛాన‌ల్ టిఆర్ పి రేటింగ్స్ పెర‌గాలంటే ఇలాంటి జిమ్మిక్కులు చెయ్యాలి హార‌తీ. ఐనా మ‌నిష‌న్న‌వాడు స్వ‌త‌హాగా చెడ్డ‌వాడు, శాడిస్టు. ఇప్పుడు కొత్త‌గా మ‌నిషి నేర్చుకునేదేమీ లేదు. పురాణాల్లో రాక్ష‌సులు లేరా. వాళ్ళు ఏ వార్త‌ల్ని చ‌దివి రాక్ష‌సులుగా త‌యార‌య్యారు..? మ‌నం వ్రాసే వార్త‌ల్ని చ‌దివినా, చ‌ద‌వ‌క‌పోయినా చెడ్డ‌వాడు.. వాడు అనుకున్న‌ది వాడు చేస్తాడు.. `` అంటూ జ‌రిగేదానికి మ‌నం ఏం చెయ్య‌లేం అన్న‌ట్టుగా చెప్పాడు క‌న‌క‌రాజు.

 `` నిజ‌మేనండీ. మ‌నిషి స్వ‌త‌హాగా చెడ్డ‌వాడే. చెడ్డ‌వాణ్ని ఏ అంశ‌మైనా త్వ‌ర‌గా ప్రేరేపిస్తుంది. అందుకే అలా ప్రేరేపించేలా రేప్‌లూ, మ‌ర్డ‌ర్లూ, దొంగ‌త‌నాలూ విడ‌మ‌రిచి చూపించ‌డం స‌రికాదు అంటున్నాను..`` అని నేను ఇంకా చెప్ప‌బోతున్నాను.

 `` అయితే ఇప్పుడేమంటావ్ హార‌తీ..`` నుదురు ముడిచి అడిగారు రాంజోషి. ముడిచిన ఆయ‌న నుదురు.. నిండిన ఆరుపదుల వ‌య‌సుని సూచిస్తూ మ‌రిన్ని ముడ‌త‌లు ప‌డింది.

 `` క్రైం ప్రోగ్రాంల‌లో అతివ‌ర్ణ‌న‌లు త‌గ్గిస్తే బావుంటుందేమో సార్‌..`` అన్నాను స్ప‌ష్టంగా.

 `` క్రైం ప్రోగ్రాంల‌కి వ‌ర్ణ‌నే ఆయువుప‌ట్టు సార్‌. మీకు ఆ విష‌యాన్ని నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. వాటివ‌ల్లే మ‌న ప్రోగ్రామ్స్‌కి టార్గెట్ రేటంగ్ పాయింట్స్ వ‌స్తున్నాయి.. `` అన్నాడు ర‌త్నాక‌ర్‌.

 అత‌ను నా మాట‌ల్ని దాటేయ‌డానికే టి ఆర్ పి రేటింగ్స్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చాడ‌నిపించింది.

    `` ప్రోగ్రాం డైరెక్ట‌ర్స్ ఆలోచించాల్సింది రేటింగ్స్ గురించి కాదు స‌ర్‌, రెస్పాన్స్‌బిలిటీ గురించి. మ‌న రెస్పాన్స్‌బిలిటీ క‌రెక్ట్‌గా ఉంటే రేటింగ్స్ ఆటోమేటిక్‌గా వ‌స్తాయి స‌ర్‌..`` అన్నాను స్థిరంగా.

 `` రెస్పాన్స్‌బిలిటీనా..! అంటే మ‌నం ఎక్క‌డ‌న్నా ఇర్రెస్పాన్స్‌బిల్ ప్రోగ్రాంస్ చూపిస్తున్నామా..`` అని వాళ్ళిద్ద‌రి వంకా సీరియ‌స్‌గా చూస్తూ అన్నారాయ‌న‌.

 `` మ‌నం ప్ర‌సారం చేసే ప్రోగ్రాంల‌లో ఉన్న‌ది అదే సార్‌. ` కుక్క మ‌నిషిని క‌రిస్తే వార్త‌కాదు,  మ‌నిషే కుక్క‌ని క‌ర‌వ‌డం వార్త‌` అని జ‌ర్న‌లిజం పాఠాల్లో నేర్చుకోవ‌డ‌మే మ‌న దౌర్భాగ్యం స‌ర్‌.   

ఎంత భిన్న‌మైన వార్త అయితే అంత ఎక్కువ ప‌బ్లిసిటీ ఇస్తున్నాం. అలాంటి భిన్న‌మైన ప‌నులు చేసి వార్త‌ల్లోకెక్కాల‌నుకునే వాళ్ళ‌ని మ‌న‌మే త‌యారు చేస్తున్నాం. మ‌నం నిజంగా రెస్పాన్సిబుల్‌గా ఉండేవాళ్ళ‌మే అయితే, అన్యాయాన్ని ఇంత‌గా ఇంజెక్ట్ చెయ్యం. మ‌నం ఛాన‌ల్లో స‌మాజానికి మంచి చేసేవాళ్ళం గురించి కంటే, ఎప్పుడూ ఆడ‌వాళ్ళ‌ని మోసం చేసేవాళ్ళ గురించీ; వాళ్ళ బంగారాన్నో, శీలాన్నో దోచుకుపోయేవాళ్ళ గురించీ; ఘోరమైన నేరాల్ని చేసేవాళ్ళ గురించే చూపిస్తున్నాం. ఆ నేర‌స్తుల‌ని ప‌దేప‌దే చూపిస్తూ, జ‌రిగిన నేరాల్ని వంద‌సార్లు వివ‌రిస్తూ వాళ్ళ‌కి ఫ్రీ ప‌బ్లిసిటీ ఇస్తున్నాం. దీనివ‌ల్ల ఏం జ‌రుగుద్దో ఒక్క‌సారన్నా గ‌మ‌నించారా..?`` అని క‌న‌క‌రాజూ, ర‌త్నాక‌ర్‌ల వంక చూసి మ‌ళ్ళీ కొన‌సాగించాను.

 `` ఇలాంటివి చూసే చాలా మంది.. అంత‌టి అరాచ‌కాల ముందు మ‌నం చేసే చిన్న చిన్న త‌ప్పుల‌కి లెక్కేంట్లే అని నిర్లక్ష్యంగా త‌యార‌వుతారు. అలాగే ఈ నేరాలు చూసి వాళ్ళ అంత‌ర్లీనంగా ఉండే ఈగోని కూడా తృప్తి ప‌రుచుకుంటారు. అంతేకాకుండా వాళ్ళూ ఏదోక భిన్న‌మైన ప‌ని చేసి, న‌లుగురికీ క‌నిపించాల‌న్న కాంక్ష‌తో ఉంటారు. అందుకే నేరాల్లో కూడా కొత్త‌కొత్త నేరాలూ, అతిజుగుప్సాక‌ర‌మైన నేరాలూ పుట్టుకొస్తున్నాయి. ఒక్క ఉదాహ‌ర‌ణ స‌ర్‌.. మీరుంటున్న‌ది ఢిల్లీలోనే క‌దా. నిర్భ‌య సంఘ‌ట‌న జ‌రిగాక‌, దానిపై వెల్లువెత్తిన నిర‌స‌న‌లు చూశాక‌,.. అలాంటి దుశ్చ‌ర్య‌లు త‌గ్గాలి క‌దా స‌ర్‌. కానీ, నిజానికి అక్క‌డ ఏం జ‌రిగింది.. ?! గ‌త సంవ‌త్సరాల్లో న‌మోదైన ఫిర్యాదుల‌కి నాలుగు రెట్లు మాన‌భంగ ఫిర్యాదు కేసులు వ‌చ్చాయి..! దానికి కార‌ణం జ‌రిగిన సంఘ‌ట‌న‌ని ఆక‌ర్ష‌ణీయంగా విడ‌మ‌రిచి చెప్ప‌డం కాదంటారా..? అది మ‌నుషుల్లో రెండోకోణంగా నిద్రించి ఉండే మృగాన్ని త‌ట్టి లేపుతుంది. మాన‌సికంగా అలాంటి నేరాల‌ప‌ట్ల ఆస‌క్తిని పెంచుతుంది. ఆ ఆస‌క్తితో ఏం చెయ్యాల‌నిపిస్తే అది చేసుకుపోతున్నారు. వాళ్ళ ప‌రిస్థితుల్నో, పెరిగిన స్థితిగ‌తుల్నో కార‌ణంగా తీసుకుంటూ వాళ్ళ‌కివాళ్ళు ఎవ‌రూ చెడ్డ‌వాళ్ళం అనుకోరు. అందుకే రావ‌ణుడి వైపు నుంచి చూసినా అత‌ని కార‌ణాలు అత‌నికుంటాయి. కానీ న్యాయం వైపు నుంచి చూస్తే మాత్రం రావ‌ణుడు చేసింది త‌ప్పే క‌ద సార్‌..`` అంటూ ఆవేశంగా ఖ‌చ్చిత‌మైన స్వ‌రంతో చెప్పాను.

 ఆయ‌న త‌లూపుతూ, `` హార‌తీ.. నువ్వు చెప్పింది నాకు అర్థం అయ్యింది. కానీ, ఒక సెన్సేష‌న‌ల్ సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు దానికి సంబంధించిన న్యూస్ అంద‌రూ చూడాలి క‌దా. అందుకే అలాంటిదాన్ని మ‌ళ్ళీమ‌ళ్ళీ వేస్తాం. బ‌ట్ ఒక కాయిన్‌కి రెండు ముఖాలున్న‌ట్లే ప్ర‌తి విష‌యానికీ రెండు కోణాలు ఉంటాయి. దాన్ని ఎవ‌రి విచ‌క్ష‌ణ‌ని బ‌ట్టి వాళ్ళు తీసుకుంటారు. రావ‌ణుడు త‌ప్పు చేశాడు. నిజ‌మే. కానీ.. రావ‌ణుడు చెడు చేశాడు క‌దా అని, అత‌ను చేసిన చేడుని రామాయ‌ణంలో లేకుండా చెయ్య‌లేదే. సూర్ప‌ణ‌ఖ‌కి కూడా అందులో కొన్ని పేజీలున్నాయి. నువ్వు అన్న‌ది నిజ‌మైతే, మ‌రి రామాయ‌ణం చ‌దివిన మ‌నిషిలో రెండో కోణం ప్రేరేపింప‌బ‌డాలిగా. మాన‌సికంగా అలాంటి నేరాల ప‌ట్ల ఆస‌క్తిని పెంచుకుని అంద‌రూ రావ‌ణుడూ, సూర్ప‌ణ‌ఖ‌ల్లాగా త‌యారై ఉంటే ఈ పాటికి ఎన్ని ల‌క్ష‌ల‌మంది రావ‌ణాసురులు మ‌న చుట్టూ ఉండాలంటావ్‌..`` అని న‌న్ను ఖండిస్తున్న‌ట్టుగా ఆన్నారాయ‌న‌.

   ఛైర్మ‌న్‌తో ఈ విభేద‌న నా ఉద్యోగానికి ముడిప‌డి ఉన్న‌ద‌ని తెలిసినా, నా వాద‌న ఇంత లోతుకు దిగిన త‌రువాత వెన‌క‌డుగు వెయ్య‌ద‌లుచుకోలేదు నేను.

 `` స‌ర్‌.. రామాయ‌ణ మ‌హాకావ్యంలో సీతాదేవి గురించి వంద‌పేజీలు వ్రాసి ఉంటే, సూర్ప‌ణ‌ఖ గురించి ఎన్ని పేజీలు వ్రాశారు..? నా చిన్న‌ప్పుడు  మా అమ్మ‌మ్మ ఎన్నో క‌థ‌లు చెప్పింది స‌ర్‌. వాటిని విన్న‌ప్పుడు ఆ క‌థల్లోని హీరోయిజం నా మ‌న‌సుకి హ‌త్తుకునేది. నేనూ అలా మంచిమంచి ప‌నులు చెయ్యాలి, ఎంద‌రినో కాపాడాలి అనుకునేదాన్ని. అదే.. మా అమ్మ‌మ్మ ఇప్పుడు టీవీల్లో, సినిమాల్లో చూపించిన‌ట్లు నాకు చెడ్డ‌వాడిని గురించీ, అలాంటి ప‌నుల గురించీ ఎక్కువ‌గా చెప్పి; చెడు చెయ్య‌డంలో థ్రిల్లుంటుంద‌నో, దొంగ‌త‌నాలు చెయ్యడంలో కిక్కుంటుంద‌నో, చెప్పి ఉంటే నాకూ అలాంటి ప‌నులే చెయ్యాల‌నిపించుండేది స‌ర్‌. సినిమా సూపిత్త మావా.. అంటూ మామా, అత్త‌గార్ల‌నీ ఏడిపించే కుసంస్కారాన్ని నేర్పి ఉంటే; అప్పుడు అందులో త‌ప్పేముంది అనిపించేది నాకు.

     ఇక్క‌డ రావ‌ణుడు రాక్ష‌సుడు. అయినా ఎన్నో మంచి ప‌నులు చేశాడు. అణ‌గ‌దొక్క‌బ‌డిన రాక్ష‌స‌జాతికి నాయ‌కుడిగా నిలిచి, వారిని న‌డిపించాడు. గొప్ప శివ‌భ‌క్తుడు. క‌ఠోర‌త‌ప‌స్సు చేసి ఆత్మ‌లింగం పొందిన‌వాడు. నిష్టాప‌రుడు. సీతాదేవిని అప‌హ‌రించుకు వెళ్ళినా, ఆమె అంగీకారం లేనిదే క‌నీసం ఆమె మీద చెయ్యి వెయ్య‌కూడ‌దు అనుకున్న వాడు. అత‌ని గురించో, సూర్ప‌ణ‌ఖ గురించో రామాయ‌ణంలో ఎందుకు చెప్పారంటే - నీలో ఎన్ని సుగుణాలు ఉన్నా నువ్వు ఎంత ప‌రాక్ర‌మ‌వంతుడివి అయినా; ప‌ర‌స్త్రీని, మ‌రొక‌రి భార్య‌ని చెర‌బ‌ట్ట‌డం త‌ప్పురా; అలా చేస్తే రావ‌ణుడిలా వ‌ధించ‌బ‌డ‌తావు అని మ‌నం నేర్చుకోవ‌డం కోసం. అంతెందుకు.. మీకు మీ పెద్ద‌వాళ్ళు రాంజోషి అని పేరు పెట్టారుకానీ రావ‌ణ్‌జోషి అని ఎందుకు పెట్ట‌లేదు స‌ర్‌..? వాళ్ళ‌ని ఆద‌ర్శంగా  తీసుకోము కాబ‌ట్టేగా. ఇలా అన్నందుకు ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ స‌ర్‌..`` అని మ‌ర్యాద పూర్వ‌కంగా చెప్పి, కొన్ని సెక‌న్లు ఆపాను.

 ఆయ‌న విస్తుపోయిన‌ట్లు న‌న్నే రెప్ప వాల్చ‌క చూస్తున్నారు. ఛైర్మ‌న్ గారికే ఎదురు చెబుతుందా అన్న‌ట్లు బిగుసుకుపోయారు క‌న‌క‌రాజూ, ర‌త్నాక‌ర్‌లిద్ద‌రూ.

  `` సార్‌..! మ‌నం ఒక వార్త‌ని ప్ర‌సారం చేస్తున్న‌ప్పుడు దానిని ఆస‌క్తిక‌రంగా చూపించ‌డం ముఖ్య‌మే. కానీ, ఆ ఆస‌క్తి.. ఆ ప‌నిని ప్రోత్స‌హించే విధంగా ఉండ‌డం త‌ప్పు స‌ర్‌. ఆడ‌పిల్ల‌ల‌పై జ‌రిగిన అత్యాచారాల్ని పూస గుచ్చిన‌ట్టు ఆర్టిస్టుల‌తో డైరెక్ష‌న్‌, యాక్ష‌న్ చేయించి ప్ర‌జ‌ల‌కి చూపిస్తున్నాం. ఇవ‌న్నీ ఎందుకు సార్‌..?

    త‌ప్ప‌నిస్థితిలో ఒళ్ళ‌మ్ముకుని జీవనం సాగించే ఆడ‌పిల్ల‌ల ప‌రువుని ప్ర‌తి ఇంట్లోనూ చూపి, మ‌న రేటింగ్స్ పెంచుకుంటున్నాం. ఇవ‌న్నీ ఎందుకు సార్‌..?

 పోనీ, ఈ త‌ప్పులని ఇంత వివ‌రంగా చూపించిన వాళ్లం, మ‌రి ఇటువంటి త‌ప్పుల‌కి విధించ‌బ‌డిన శిక్ష‌ల‌నీ చూపిస్తున్నామా..? ఆ శిక్ష‌ల్ని ఒక‌టో రెండో పెద్ద‌కేసుల్లో.. ఐ మీన్‌.. మ‌నం పెద్ద‌వి చేసిన కేసుల్లో మాత్రం చిన్న న్యూస్‌గా చూపిస్తాం. రోజుకి ఎన్ని కోర్టుల్లో ఎంత‌మందికి శిక్ష‌లు ప‌డ‌డంలేదు. మ‌రి అవ‌న్నీ న్యూస్‌లో ఎందుకు చూపించ‌ట్లేదు..? చెడుని ఎక్స్‌పోజ్ చేసి చూపిస్తున్న‌ప్పుడు, అది గ్ర‌హించే మెదడుల‌కి.. ఆ చెడు ప‌ని చేసినందుకు ఏ ప్ర‌తిఫ‌లం వ‌చ్చిందో కూడా అంత‌క‌న్నా ఎక్స్‌పోజ్ చేసి చూప‌డం మ‌న బాధ్య‌త‌. అప్పుడే ఆ వార్త సంపూర్ణం అయిన‌ట్టు స‌ర్‌. మ‌నం ఇస్తున్న స‌గంస‌గం వార్త‌ల్ని చ‌దివితే, నేరం చెయ్య‌డం తెలుస్తుందిగానీ, దానికి ప‌డిన శిక్ష తెలియ‌దు. ఆ తెలియ‌క‌పోవ‌డ‌మే.. వాళ్ళ‌ని నేరం చెయ్య‌డానికి పురికొల్పుతుంది. ఒక నేరం చూసి మ‌రొక‌టి, మ‌రోదాన్ని చూసి ఇంకొక‌టిగా.. ఒక్కో నేరానికీ త‌మ్ముళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు.. `` అంటూ ఇంకా చెప్తున్నాను.

     `` హార‌తీ.. నువ్వు మ‌రీ ఓవ‌ర్‌గా ఆలోచిస్తున్నావ్‌. స‌మాజం మొత్తం టీవీల వ‌ల్లే పాడైపోయింది అన్న‌ట్టు మాట్లాడుతున్నావ్‌. మ‌న ఛానెల్‌లో ఆరోగ్యానికి సంబంధించిన ప్రోగ్రాంల‌నీ; భ‌క్తీ ప్ర‌వ‌చ‌నాల ప్రోగ్రాంల‌నీ ప్ర‌తీరోజూ వేస్తున్నాం క‌దా. మ‌రి మ‌న ఛానెల్ వ‌ల్ల మంచి కూడా వ్యాప్తి చెందుతుంది క‌దా.. `` గంభీరం నిండిన గొంతుతో లాజిక‌ల్‌గా అడుగుతూ, దీనికి ఏం జవాబు చెప్తావ్ అన్న‌ట్టు సూటిగా నా క‌ళ్ళ‌లోకి చూశారు రాంజోషి గారు.

     `` అవును స‌ర్‌.. వేస్తున్నాం. కానీ, ఏ స‌మ‌యంలో.. ? ఇళ్ళ‌లో అంద‌రూ ఇంకా నిద్ర లేవ‌న‌ప్పుడు. మ‌రి.. క్రైం వాచ్‌ల‌ని ఏ స‌మయానికి వేస్తున్నాం..? ఉద్యోగాల నుండి వ‌చ్చి, ఇంటిలోని వారంద‌రూ క‌ల‌సి భోజ‌నం చేసి, రిలాక్స్ అవుతున్న‌ప్పుడు. అంటే అంద‌రూ చూసే టైంలో నేరాలూ, దారుణాలూ చూపించి, వాళ్ళు నిద్ర‌పోయే స‌మ‌యంలో భ‌క్తి ప్రోగ్రాంలు వేస్తున్నాం. నిజంగా మంచినే చెప్పాలి అనుకుంటే వాళ్ళ‌మ‌యితే ఇలానే చేస్తామా సార్‌.. ? `` అని ఆవేశంగా అడిగాను.

     `` న‌లుగురికీ తెలియాలఇ, పాపులారిటీ కోసం వాటిని అలా వేస్తున్నాం. దానికి.. `` అంటూ ఇంకా ఏదో చెప్ప‌బోయారు ఆయ‌న‌.

  `` పాపులారిటీ కోసం..! అవును సార్‌.. మీడియాకీ, సినిమాకీ కావ‌ల‌సింది అది ఒక్క‌టే..!! దాని వ‌ల‌న స‌మాజం నాశ‌నం అయిపోయినా ప‌ర్వాలేదు. ఎప్పుడో ముప్పై అయిదు సంవ‌త్స‌రాల క్రితం అంటే 1978లో బిల్లా, రంగా అనే వాళ్ళు చేసిన నేరం దేశం మొత్తాన్నీ వ‌ణికించింది. వాళ్ళ‌ని అస‌హ్యించుకునేలా చేసింది. పెద్ద‌వారిగా ఆ సంఘ‌ట‌న నాకంటే మీకే ఎక్కువ‌గా తెలుసు స‌ర్‌. అప్పుడు ఆ రెండు పేర్లూ బాగా పాపుల‌ర్ అయ్యాయ‌న్న కార‌ణంతో వాటిని సినిమాలో క‌థానాయకుల‌కి పెట్టారు. అంటే మీడియాకీ, సినిమాకీ ఏం కావాలి స‌ర్‌..? మ‌ంచి చేసినా, చెడు చేసినా ప‌ర్వాలేదు. కానీ పాపులర్ అయితే చాలు.. అదేగా కావ‌ల‌సింది..!

     ఇది చాలా గాఢంగా ఆలోచించాల్సిన విష‌యం స‌ర్‌. మ‌న పురాణాల్లో రావ‌ణుడి కౄర‌త్వాన్ని పాపుల‌ర్ చేశారు. దాంతో పాటూ అత‌ను అనుభ‌వించిన శిక్ష‌నీ పాపుల‌ర్ చేశారు.

    కానీ మ‌నం నేరాన్ని మాత్ర‌మే పాపుల‌ర్ చేసి, దానికి హీరోయిజాన్ని ఆపాదిస్తున్నాం స‌ర్‌. అందుకే.. ఆ ప్ర‌భావానికి రాటుదేలిపోవ‌డంవ‌ల్లే.. మ‌నం మీడియాలో ప్ర‌సారం చేసే క్రైంవాచ్‌లూ, క్రైంటైంలూ, నేరాలూఘోరాల ముసుగుల్లోంచి కూడా ఇప్పుడు నేర‌స్తులు పుట్టుకొస్తున్నారు. ప్ర‌జ‌ల్లోంచో, ప్ర‌భుత్వం నుంచో, లేక కొన్ని సంస్థ‌ల నుంచో, వ్య‌వ‌స్థ‌ల్లోంచో,.. వ‌చ్చిన త‌ప్పొప్పుల్ని ఎత్తిచూపి వాటిని స‌రిదిద్ద‌డం కోస‌మే క‌దా సార్ మ‌నం ఉంది. కానీ అటువంటి బాధ్య‌త క‌లిగిన మ‌న మీడియానే మాన‌సిక వైక‌ల్యంతో ఉంటూ, మ‌న‌మే నేర‌పూరితంగా ఉంటే; ఇంక మ‌నం ఎటువంటి స‌మాజాన్ని త‌యారు చేస్తాం సార్‌..?

    ఆ మార్పు ముందు మ‌న‌లోనే రావాల‌ని కోరుకుంటున్నాను. మీలాంటి పెద్ద‌ల నుంచే రావాల‌ని కోరుకుంటున్నాను. నేను ఇలా మాట్లాడి మీ విలువైన కాలాన్ని వృధా చేసి ఉంటే మ‌న్నించండి సార్‌. కానీ.. మ‌రొక్క‌సారి వీటి గురించి ఆలోచించండి..`` అని ఉద్వేగంగా చెప్తూ కుర్చీలోంచి లేచాను.

   ఇప్పుడు నేను మాట్లాడిన‌దంతా నా మ‌న‌సు ప‌డిన‌, ప‌డుతున్న సంఘ‌ర్ష‌ణ‌. కానీ, ఆయ‌న‌కి మాత్రం.. ఇది ఎంతో ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌సారం మ‌ధ్య‌లో వ‌చ్చే ప‌నికిరాని ఒక ప్ర‌క‌ట‌న‌..!  రెండు చేతులూ జోడించి వెన‌క్కి తిరిగాను నేను.   నాతో, నా భావాల‌తో ఎన్నోసార్లు విభేదించిన ప్రోగ్రాం అసోసియేట‌ర్ క‌న‌క‌రాజూ, న్యూస్‌ప్రోగ్రాం డైరెక్ట‌ర్ ర‌త్నాక‌ర్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్న న‌న్నే ఎర్ర‌గా చూస్తున్నారు. 

  ఉద‌యం.. ఎప్ప‌ట్లానే నిద్ర ముఖంతో స్ట‌వ్ ముందు నిల‌బ‌డి వార్తాప‌త్రిక‌ని చూస్తుంటే, నిన్న మా ఛైర్మ‌న్ గారితో విభేదిస్తూ త‌ర్కించిన సంగ‌తంతా గుర్తొచ్చింది.  ఆలోచ‌న‌లు ఇంకా దాని చుట్టూనే తిరుగుతున్నాయి. క‌ళ్ళ‌ముందు క‌నిపిస్తున్న వార్త‌ల్ని చ‌ద‌వ‌బుద్ధి కాలేదు. ఎందుకో ఈ విష‌యంలో నిర్లిప్తంగా ఉండ‌లేక‌పోతోంది మొద‌డు. నా ఆలోచ‌న‌ల్లో ఎంత స‌మ‌యం గ‌డిచిందో..!

  `` హార‌తీ.. నీకు ఫోన్‌..`` అంటూ బెడ్రూంలోంచి ఫోన్ తెచ్చి నాకు ఇస్తూ, `` నిద్ర లేవ‌గానే న్యూస్‌పేప‌ర్ చ‌ద‌వొద్దు అని ఎన్ని సార్లు చెప్పాలీ..`` అంటూ నా చేతిలోని దిన‌ప‌త్రిక‌ని లాక్కున్న‌ట్టుగా తీసుకుని అల‌మ‌రాలో ప‌డేశాడు విక్రం.

 ఫోన్ లిఫ్ట్ చేసి `` హ‌లో.. `` అంటూ హాల్లోకొచ్చి కూర్చున్నాను.

 `` గుడ్ మార్నింగ్ హార‌తీ..!`` అంటున్న మా ఛైర్మ‌న్ గారి గొంతులో గంభీరంతో పాటూ చిరున‌వ్వు వినిపించింది.

 `` గుడ్ మార్నింగ్ స‌ర్‌.. `` అన్నాను నిటారుగా కూర్చుంటూ.

 `` ఇన్నాళ్ళూ డ‌బ్బుని సంపాదించి స‌మాజంలో నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచి పాపుల‌ర్ అవ్వ‌డ‌మే నా ధ్యేయం అనుకున్నాను. కానీ, ఇప్పుడు స‌మాజానికి నేనేం ఇవ్వాలో తెలుసుకుంటున్నాను హార‌తీ. నా ఒక్క‌గానొక్క కొడుకు యూఎస్ వ‌చ్చెయ్య‌మ‌ని ఎన్నిసార్లు చెప్తున్నా, నాకు రెండో కొడుకులాంటి ఈ ఛాన‌ల్‌ని నాలాగా ఎవరు చూసుకోలేర‌న్న కార‌ణంతో ఇక్క‌డే ఉండిపోయాను. కానీ.. నిన్న నీతో మాట్లాడిన త‌రువాత నాకు న‌మ్మ‌కం వ‌చ్చింది..`` అని ఆపారాయ‌న‌.

     ఆయ‌న ఏం చెప్తున్నారో అర్థంకాక‌, ఆస‌క్తిగా ఫోన్‌ని చెవికి ఇంకా ద‌గ్గ‌ర‌కి ఆనించుకున్నాను.

 `` నువ్వు నా ` ఆర్జే మీడియా క‌మ్యూనికేష‌న్స్‌`ని అచ్చం నాలాగే.. ఊహు నాకంటే ఎక్కువ‌గా చూసుకోగ‌ల‌వు అనిపిస్తోంది. అనిపించ‌డం కాదు.. నూరుశాతం చూసుకోగ‌ల‌వు. అందుకే నా స్థానంలో నీకు ప‌వ‌రాఫ్ అటార్నీ ఇచ్చి, నేను కొన్నాళ్ళు యూఎస్ వెళ‌దామ‌నుకుంటున్నాను. దీనికి నువ్వు ఏమంటావు..`` అంటున్న ఆయ‌న గొంతులో ఇంకా గంభీర‌తే..!

  నాకు నోటు మాట రాలేదు.

త‌ప్పుగా న‌డుస్తుండ‌డాన్ని ఎత్తి చూపాను నేను. కానీ, ఆయ‌న త‌ప్పులేం రాకుండా చూసుకో.. అని ప‌గ్గాల్ని  నా చేతికే ఇస్తానంటున్నారు..!

` ఆర్యూ దేర్‌..? ఇంపార్టెంట్ వ‌ర్క్స్ ఉంటే త్వ‌ర‌గా చూసుకో. ఈ రోజు ఫ్లైట్‌కే మెయిన్ బ్రాంచ్‌కి వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం..`` అని కొంచెం హెచ్చుస్వ‌రంతో చెప్పారాయ‌న‌.

 ఆయ‌న మాట‌ల‌కి, ఉత్సాహాన్ని మించిన ఉద్వేగ‌మేదో మెద‌డుని ఆక్ర‌మిస్తుంటే, `` అలాగే స‌ర్ .. `` అన్నాను.